"విశ్వదాభిరామ వినురవేమ" అనే మాట వినని తెలుగు వాడు ఉండడు. వానకు తడవనివారు, ఒక్క వేమన పద్యం కూడా రాని తెలుగువారుఉండరని లోకోక్తి.
చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ద్వారా వేమన పద్యాలు వెలుగులోకి వచ్చాయి. పామరులకు కూడా అర్థమయ్యే భాషలో పద్యాలు చెప్పి ప్రజల్ని మెప్పించినకవి, వేమన .ఆటవెలది తో అద్భుతమైన కవిత్వము, అనంతమైన విలువ గల సలహాలు, సూచనలు, విలువలు, తెలుగు సంగతులు ఇమిడ్చిన మహానుభావుడు,యోగి వేమన.
జీవితం
వేమన చరిత్ర అస్పష్టంగా ఉంది. సుమారు 1352 - 1430 మధ్య కాలములో జీవించి ఉండవచ్చు. బహుళ ప్రచారంలో ఉన్న కథనం ప్రకరం వేమన వివరాలు ఇలాఉన్నాయి.
వేమన కొండవీటి రెడ్డిరాజవంశానికి చెందిన వారు అని, గండికోట దుర్గాధిపతులతో సంబంధం కలిగినవారని అంటారు. కానీ ఇది నిజం కాదని పరిశోధకులుతెలియజేస్తున్నారు. కడప మండలంలోని ఒక చిన్న పల్లెలో మధ్య తరగతి కాపు కులస్థులకు జన్మించారని అంటున్నారు. ఆయన నందన నామ సంవత్సరము,ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు. ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
నందన సంవత్సరమున
బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్
బృందార కాద్రి సేతువు
నందున నొక వీర వరుని జన్మము వేమా!
బృందారక =ఘనమైన
అద్రి=కొండల
సేతువు = సముద్రాన్ని కానీ , నదిని కానీ రెండుగా చీల్చేది (భూమి). (రామ సేతు మనకు శ్రీలంకకు మధ్య నున్న సముద్రాన్ని చీలుస్తూ నిర్మించినది . )
పై పద్యంలో వేమన ఆచార్యులు రెండు గొప్ప కొండల నడుమనున్న సేతువు తన జన్మ స్థలం అని చెప్పారు. రెండు కొండలను నడుమ నుండి పారే నదులు మనకు చాలఉన్నాయి , ఉదాహరణకు కృష్ణ నది. కానీ అవి సేతువు ఏర్పరచలేదు . మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ప్రదేశం ఉండేది వైఎస్ఆర్ జిల్లాలో వేంపల్లి కి దగ్గరలో నున్న "గండి"లో "వీరన్న గట్టు పల్లి" అనే గ్రామం వేమన గారి జన్మస్థలం. పాపాగ్ని నది ఇ క్కడి శేషాచల కొండల శ్రేణిని రెండుగా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది. వేమన జన్మస్థలంవీరన్నగట్టుపల్లి అనడానికి ఒక గొప్ప నిదర్శనం ఉంది.
1820 లో మద్రాసు గవర్నర్ గా నియమితులైన 'సర్ థోమస్ మన్రో' గారు పన్నులు వసూలు చేసే నిమిత్తం కడపలో నున్న గండికి ప్రవేశించారు. అక్కడ ఆయనకుబంగారు తోరణాలు కనిపించాయి. వారు తన సైనికులతో ఆ విషయం చెప్పగా , వారెవ్వరకు ఆ తోరణాలు కనిపించలేదు. ఆయన అక్కడున్న వాళ్ళతో "ఇక్కడో రాజాధిరాజు ఉన్నాడు, ఎక్కడున్నాడో వెతకండి" అన్నారు. వాళ్ళు గండి మొత్తం గాలించి ఎవరు లేరని తేల్చారు కానీ, థోమస్ మన్రో గారు మాత్రం అక్కడే విడిది చేసి చాల రోజులుఉన్నారు. గండి లో నున్న శ్రీ ఆంజనేయ స్వామి బొమ్మ ఈ బంగారు తోరానికి కారణం అని భావించి అక్కడ ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. కానీ అక్కడకు కొన్నిగజాల దూరంలో నున్న వీరన్న గట్టు పల్లి నుండి ప్రసరించిన దివ్య కిరణాలే ఆ బంగారపు తోరణాలు. అవి యోగి వేమన పూజించి వదిలిన యంత్రం నుండి వచ్చినవికావచ్చు, ఆయన ఆత్మ స్వరూపం నుండి వచ్చినవి కావచ్చు. విచిత్రం ఏమిటంటే, ఈ బంగారు తోరణాలు కనిపించిన ఆరు నెలల్లో మన్రో గారు చనిపోయారు. పాములకు,సిద్దులకు తెలిసి కానీ తెలియకకాని కష్టం కలిగితే ఫలితం వేరుగా ఉంటుంది అని లోకంలో నానుడి. తన జన్మస్థలాన్ని మంది మార్బలంతో ఆణువణువూ పరిశీలించడం ఆమహా యోగికి బహుశ నచ్చివుండలేదేమో.
ఈయన యవ్వనంలో వేశ్యాలోలుడిగా జీవించారు. కొంతకాలానికి విరక్తిచెంది, తపస్సు చేసి యోగిగా మారారు. సమాజానికి హితబోధ చేస్తూ వేలాది పద్యాలు చెప్పారు.చివరికి కడప దగ్గరి పామూరుకొండ గుహలో శార్వరినామ సంవత్సరం శ్రీరామ నవమి నాడు సమాధి చెందారు.
వేమన సమాధి అని ఇప్పటికీ ప్రసిద్ధమైనది కదిరి తాలూకాలోని కటారుపల్లె. ఇక్కడ వేమన సమాధి ఉంది. వేమన రసవాది అని స్వర్ణవిద్య కోసం గురువులకై వెతికారనిఐతిహ్యం ఉంది.
వేమన పద్యాలలో అతని జీవితం
వేమన పద్యాలలో అతని జీవితానికి సంబంధించిన క్రింది పద్యాలు ముఖ్యంగా ఉదాహరిస్తారు.
నందన సంవత్సరమున; పొందుగ కార్తీకమందు బున్నమినాడీ
వింధ్యాద్రి సేతువులకును, నందున నొక వీరు డేరుపడెరా వేమా!
ఊరుకొండవీడు వునికి పశ్చిమవీధి; మూగచింతపల్లె మొదటి యిల్లు
ఎడ్డిరెడ్డికులము యేమని చెప్పుదు; విశ్వదాభిరామ వినురవేమ!
కాదనడెవ్వరితోడను; వాదాడగబోడు వెర్రివానివిధమునన్
భేదాభేద మెరుంగును; వేదాంత రహస్యములను వేమన నుడువున్ ||
మృగము మృగమనుచును మృగమును దూషింత్రు మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును మృగముకున్న గుణము మూర్ఖునకేదయా? విశ్వదాభిరామ వినురవేమ!
హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన ఘనుడు గాడు మొరకు జనుడె గాని పరిమళములు గార్దభము మోయ ఘనమౌనె విశ్వదాభి రామ వినురవేమ!
విద్యలేనివాడు విద్వాంసు చేరువ నుండగానె పండితుండు కాడు కొలది హంసల కడ కొక్కెర లున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ!
అంతరంగమందు నపరాధములు సేసి మంచివాని వలెనె మనుజుడుండు ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా? విశ్వదాభిరామ వినురవేమ! అల్ప బుద్ధి వానికథికారమిచ్చిన దొడ్డ వారి నెల్ల తొలగగొట్టు చెప్పు దినెడి కుక్క చెరకు తీపెరుగునా? విశ్వదాభిరామ వినురవేమ!
అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా? విశ్వదాభిరామ వినురవేమ!
--